: చర్చనీయాంశంగా మారిన జేసీ, చమన్ ల ఏకాంత చర్చలు!
అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డితో జిల్లా పరిషత్ ఛైర్మన్ చమన్ ఏకాంతంగా జరిపిన చర్చలు ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. నిన్న ఓ వివాహానికి హాజరైన చమన్... తిరుగు ప్రయాణంలో ప్రభాకర్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఇద్దరూ కాసేపు కుశల ప్రశ్నలు వేసుకున్నారు. అనంతరం తన అనుచరులతో పాటు, చమన్ అనుచరులందరినీ జేసీ బయటకు పంపించారు. అనంతరం ఇద్దరూ గంటసేపు ఏకాంతంగా చర్చలు జరిపారు. అయితే, ఏం మాట్లాడారన్న విషయంపై ఇంతవరకు ఇద్దరూ నోరు మెదపలేదు. దీంతో, ఇది చర్చనీయాంశంగా మారింది. జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవిలో పూర్తికాలం కొనసాగే విషయంపై జేసీ మద్దతును చమన్ కోరారని కొందరు భావిస్తున్నారు. మరోవైపు జిల్లా రాజకీయాలపై చర్చించుకున్నారని మరికొందరు చెబుతున్నారు.