: జగన్ అక్రమాస్తులను అప్పగిస్తే విశాఖ భూములపై సీబీఐ విచారణ జరిపిస్తాం: మంత్రి సోమిరెడ్డి
విశాఖపట్నం భూముల వ్యవహారం కేసులో ప్రతిపక్ష పార్టీల నేతలు చేస్తోన్న విమర్శలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ నేతలు అన్నిటికీ సీబీఐ పేరు ఎత్తుతున్నారని, అసలు జగన్ టీమ్‌కు సీబీఐ పేరెత్తే అర్హత లేదని అన్నారు. సిట్ విచారణలో పూర్తిగా న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ కేసుకు సిట్ చాలని, సీబీఐ ఎందుకని ప్రశ్నించారు.
తమ ప్రభుత్వం ఏ పని చేసినా అనవసరమైన విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. జగన్ అక్రమాస్తులను అప్పగిస్తే విశాఖ భూములపై సీబీఐ విచారణ జరిపిస్తామని సవాలు విసిరారు. సీబీఐపై నమ్మకం ఉంటే జప్తు చేసిన ఆస్తులను అప్పగించి జగన్ శిక్ష అనుభవించాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు ఇదే అంశంపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రభుత్వంపై పలు విమర్శలు చేస్తున్నారని, ఆయన వ్యాఖ్యలు సరికాదని సోమిరెడ్డి అన్నారు.