: నా సంపాదనను దానం చేయాలనుకుంటున్నాను.. సలహాలివ్వండి: అమెజాన్ సీఈవో ట్వీట్
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఫౌండర్, సీఈవో జెఫ్ బీజోస్ తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో చేసిన ఓ ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తన సంస్థ భారీగా లాభాలు సాధిస్తూ దూసుకెళుతుండడంతో ఆయన ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన తాను సంపాదించిన డబ్బులో కోట్లాది రూపాయలను విరాళంగా ఇవ్వాలని, సమాజసేవకు ఉపయోగించాలని అనుకుంటున్నారు. ఇందు కోసం తనకు ఐడియాలు ఇవ్వాలని జెఫ్ బీజోస్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు విశేష స్పందన వస్తోంది. కొన్ని గంటల్లోనే 5 వేల రీట్వీట్‌లు, 10 వేల లైకులు వచ్చాయి. ఆయనకు 15 వేల మందికి పైగా రిప్లైలు ఇచ్చారు. ఆయన చేయాలనుకుంటున్న పనిని అభినందిస్తున్నారు.
ఈ ట్వీటులో జెఫ్ ఏమని రాశారంటే, తాను సంపాదించిన ఆస్తులని దానం చేయాలనుకుంటున్నానని, తన సొమ్ములో ఎక్కువ శాతం దానాలకే వినియోగిస్తానని, కానీ తనకు ఇంకా చేయాలని కోరికగా ఉందని తెలిపారు. ఒకవేళ తాను ఇలా ప్రకటించడం తప్పనిపిస్తే, ఆ విషయాన్ని కూడా నిర్మొహమాటంగా తనకు చెప్పాలని ఆయన ప్రజలను కోరారు. జెఫ్ బేజోస్ మొత్తం ఆస్తివిలువ సుమారు 76 బిలియన్ల డాలర్లు ఉంటుంది. ఇటీవలే ఫ్రెడ్ హచిన్సన్ అనే ఓ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్.. బెజోస్ కుటుంబం నుంచి 35 మిలియన్ డాలర్లను అందుకుంది.