: ముంబై పేలుళ్ల కేసు.. ముస్తఫా దోస్సా, అబూ సలేంలతో పాటు మరో ఐదుగురిని దోషులుగా ప్రకటించిన టాడా కోర్టు!
ముంబై వరుస పేలుళ్ల కేసులో టాడా కోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. పేలుళ్ల వెనకున్న మాస్టర్ మైండ్ ముస్తఫా దోస్సాను ప్రధాన కుట్రదారుగా కోర్టు నిర్ధారించింది. ముస్తఫాతో పాటు గ్యాంగ్ స్టర్ అబూసలేం సహా మరో ఐదుగురిని టాడా కోర్టు దోషులుగా ప్రకటించింది. మిగిలినవారిలో ఫిరోజ్ అబ్దుల్ రషీద్ ఖాన్, అబ్దుల్ ఖయ్యూం, రియాజ్ సిద్ధిఖీ, తాహిర్ తక్లా, కరీముల్లాఖాన్ లు ఉన్నారు. 1993 మార్చి 12న 12 చోట్ల జరిగిన వరుస పేలుళ్లతో ముంబై దద్దరిల్లింది. ఈ పేలుళ్లలో 257 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 715 మంది గాయపడ్డారు. దావూద్ గ్యాంగ్ పాల్పడ్డ ఈ పేలుళ్లలో అబూసలేం, ముస్తఫాలు ప్రధాన పాత్రను పోషించారు. ప్రస్తుతం వీరిద్దరూ జైల్లోనే ఉన్నారు. పేలుళ్లలో తమ పాత్ర ఏమీ లేదని... కేవలం ఆయుధాలను మాత్రమే సరఫరా చేశామని అబూ సలేం చెప్పినా, కోర్టు ఆయన వ్యాఖ్యలతో ఏకీభవించలేదు. నిందితులందరినీ వేర్వేరుగా విచారించిన న్యాయస్థానం, వీరందరినీ దోషులుగా పేర్కొంది.