: జేసీపై మొత్తం ఏడు ఎయిర్ లైన్స్ సంస్థలు వేటు వేశాయ్
టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అనుచిత ప్రవర్తనకు శిక్షగా ఆయనపై ఒక్కో విమానయాన సంస్థ వరుసబెట్టి బహిష్కరణ వేటు వేస్తున్నాయి. నిన్న విశాఖపట్నం విమానాశ్రయంలో దివాకర్ రెడ్డి ఇండిగో ఎయిర్ లైన్స్ ఉద్యోగి పట్ల దురుసుగా ప్రవర్తించడం, అక్కడి ప్రింటర్ ను తోసేయడం తెలిసిందే. విశాఖ నుంచి హైదరాబాద్ కు వెళ్లాల్సిన జేసీ నిబంధనల ప్రకారం 45 నిమిషాల కంటే ముందే రావాలి. ఫ్లయిట్ బయల్దేరే సమయానికి 45 నిమిషాల ముందే ప్రయాణికుల చెకిన్ పూర్తి చేయాలన్నది నిబంధన.
కానీ జేసీ 28 నిమిషాల ముందు మాత్రమే వచ్చారు. అప్పటికే చెకిన్ అయిపోవడంతో తర్వాత ఫ్లయిట్ లో పంపిస్తామని ఇండిగో సిబ్బంది చెప్పడంతో జేసీకి చిర్రెత్తుకొచ్చింది. దాంతో దౌర్జన్యం చేశారు. ఆయన ప్రవర్తనను ఖండిస్తూ ఇకపై తమ విమానాల్లో ప్రయాణించేందుకు అనుమతించబోమని ఇండిగో స్పష్టం చేసింది. ఆ తర్వాత ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్ వేస్, విస్తారా, స్పైస్ జెట్, ఎయిరేషియా, గో ఎయిర్ కూడా దివాకర్ రెడ్డిపై వేటు వేశాయి. దీంతో ట్రూ జెట్ మినహా మొత్తం ఏడు విమానయాన సంస్థలు ఆయనపై చర్య తీసుకున్నట్టు అయింది.