: బంగ్లా వన్డేతో కోహ్లీ సాధించిన రికార్డు ఇదే!
ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్ లో తృటిలో సెంచరీ మిస్ అయిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఖాతాలో మరో ఘనత సొంతం చేసుకున్నాడు. రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఆడుతూ పాడుతూ 96 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచిన కోహ్లీ 8 వేల పరుగుల క్లబ్ లో చేరాడు. వన్డేల్లో కోహ్లీ 8,000 పరుగులు పూర్తి చేశాడు. అలుపెరుగని పరుగుల యంత్రంగా పేర్కొనే కోహ్లీ భారీ షాట్ల కంటే కళాత్మక షాట్లకు ప్రాధాన్యతనిస్తాడు. అనితర సాధ్యమైన ఆటతీరుతో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. మైదానంలో దూకుడుగా ఉండే కోహ్లీ అప్పుడప్పుడు వివాదాలకు కేంద్రంగా నిలిచినా, తన ఆటతీరుతో అన్నింటినీ అధిగమిస్తున్నాడు. ప్రస్తుతం విరాట్ తన కెరీర్ లో అత్యుత్తమ స్థాయిలో ఉన్నాడు. కాగా, నిన్న బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 77 బంతుల్లో ఆరు ఫోర్ల సాయంతో 96 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే.