: ప్రధానితో పాటు 74 నగరాల్లో 74 మంది మంత్రులు!
ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది 'యోగా డే'ని ఘనంగా నిర్వహించాలని సంకల్పించారు. ఈ నేపథ్యంలో ఈసారి కేంద్ర మంత్రులందరికీ కొత్త బాధ్యత అప్పగించనున్నారు. కేబినెట్ లోని మంత్రులంతా యోగాడేలో పాల్గొనేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. దేశవ్యాప్తంగా గల 74 ప్రధాన నగరాల్లో 74 మంది కేబినెట్ సహచరులు పాల్గొనేలా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. జూన్ 21న యోగాడే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో పాటు వెంకయ్యనాయుడు ఢిల్లీలో నిర్వహించనున్న యోగాడేలో పాల్గొంటున్నారు.
మరోపక్క, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అహ్మదాబాద్ లో, హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ హిమాచల్ ప్రదేశ్ లోని సుజాన్ పూర్ తిహ్రా నగరంలో పాల్గొంటుండగా, మిగిలిన కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, స్మృతీ ఇరానీ, ధర్మేంద్ర ప్రధాన్, పీయూష్ గోయెల్, సురేష్ ప్రభు, అశోక్ గజపతి రాజు తదితరులు వరుసగా పట్నా, నాగ్ పూర్, ఛండీగఢ్, కొచ్చి, భువనేశ్వర్, విశాఖపట్టణం వంటి ప్రాంతాల్లో నిర్వహించే యోగాడేలో పాల్గొననున్నట్టు తెలుస్తోంది.