: నిర్మాతగా నా తొలి, చివరి సినిమా ఇదే!: రణ్ బీర్ కపూర్ ప్రకటన
నిర్మాతగా తన తొలి, చివరి సినిమా 'జగ్గా జాసూస్' అని ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్ బీర్ కపూర్ తెలిపాడు. జగ్గాజాసూస్ ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా రణ్ బీర్ కపూర్ మాట్లాడుతూ, తాను చాలా బద్ధకస్తుడినని, తన తత్వానికి సినీ నిర్మాణం సరిపోదని, ఆ విషయం జగ్గా జాసూస్ తో తేలిపోయిందని చెప్పాడు. నటుడిగా ఆనందంగా ఉన్నానని అన్నాడు. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించడం ఆనందంగా ఉందని చెప్పాడు.
కాగా, రణ్ బీర్ కపూర్ తాత అయిన బాలీవుడ్ సూపర్ స్టార్ రాజ్ కపూర్ 1948లో ఆర్.కె.ఫిలిమ్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు. అప్పట్లో ఆ బ్యానర్ పై చాలా సినిమాలు వచ్చాయి. 1999 తరువాత ఆ బ్యానర్ పై సినిమాలు నిర్మించడం మానేశారు. ఆ నిర్మాణ సంస్థ బాధ్యతలు తీసుకున్న రణ్ బీర్ కపూర్ జగ్గా జాసూస్ నిర్మిస్తున్నట్టు తెలిపాడు. తరువాత వరుసగా సినిమాలు నిర్మించే ప్రయత్నం చేస్తానని అప్పట్లో తెలిపాడు. తాజాగా, ఈ ఒక్కసినిమా నిర్మాణం చాలని, ఇకపై సినిమాలు తీయనని చెప్పాడు. ఈ సినిమా సమయంలో విభేదాలు రావడంతో కత్రినా కైఫ్ ఈ సినిమా నిర్మాణంలో సహకరించలేదు. దీంతో ఈ సినిమా ఆలస్యంగా రూపుదిద్దుకుంది.