: హృదయవిదారక ఘటన.. మేనకోడలి మృతదేహాన్ని భుజాన వేసుకొని 10కి.మీ ప్రయాణించాడు!
ఏడు నెలల తన మేనకోడలి మృతదేహాన్ని తన భుజాలపైనే ఉంచుకొని సైకిల్‌పై ఓ వ్యక్తి 10 కిలోమీటర్లు ప్రయాణించిన ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని మజ్ హన్ పూర్, మలాక్ సద్దీ గ్రామంలో చోటు చేసుకుంది. తమ మేనకోడలు పూనమ్ వాంతులు, విరేచనాలతో బాధపడుతుండడంతో జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. ఆ పాప తండ్రి ఆసుపత్రి ఖర్చుల కోసం డబ్బులు సంపాదించడానికి కూలీ పనికి వెళ్లాడు. దీంతో ఆ చిన్నారిని ఆ పాప మామయ్య బ్రిజ్ మోహన్ చూసుకుంటున్నాడు. రెండు రోజుల చికిత్స అనంతరం ఆ పాప మృతిచెందింది.
ఆమెను తీసుకెళ్లడానికి అంబులెన్స్ కావాలని ఆయన అడిగాడు. అయితే, అక్కడి సిబ్బంది తమ చేతిలో డబ్బు పడందే అంబులెన్స్‌ను కదల్చమని చెప్పేయడంతో ఆ చిన్నారి మృతదేహాన్ని భుజాన వేసుకొని సైకిల్‌పై గ్రామానికి తీసుకు వెళ్లాడు. ఈ సంఘటనపై స్పందించిన చీఫ్ మెడికల్ ఆఫీసర్ విచారణకు ఆదేశించారు. అంబులెన్స్ డ్రైవర్ తో పాటు ఓ వైద్యుడిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అంబులెన్స్ సర్వీసుని కొనసాగించడానికి డీజిల్ కు డబ్బులేక పోవడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని ఆసుపత్రి అధికారులు అంటున్నారు.