: కూకట్ పల్లి ఎమ్మెల్యే పార్టీ మారడానికి.. భూ కబ్జాకు సంబంధం లేదా?: ఉత్తమ్ కుమార్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఉమ్మడి రాష్ట్రంలో భూములను దోచుకున్నారని... టీఆర్ఎస్ హయాంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని కేసీఆర్ వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందని అన్నారు. భూ కుంభకోణాల వెనుక ముఖ్యమంత్రి కార్యాలయ అధికారుల హస్తం లేదా? అని నిలదీశారు. కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పార్టీ మారడానికి... భూ కబ్జాలకు సంబంధం లేదా? అని ప్రశ్నించారు.
మొత్తం రూ. 10వేల కోట్ల భూ కుంభకోణం జరిగిందని ఉత్తమ్ మండిపడ్డారు. భూ స్కామ్ లపై సమీక్షలో ఎంపీ కవిత ఎలా పాల్గొంటారని ప్రశ్నించారు. భూ కబ్జాకు సంబంధించి ఎస్కే సిన్హా రిపోర్ట్ ను ప్రజల ముందు ఉంచాలని చెప్పారు. ఎలాంటి అక్రమాలు జరగకపోతే మియాపూర్ భూ కుంభకోణంపై సీబీఐ విచారణకు ఎందుకు ఒప్పుకోవడం లేదని విమర్శించారు. మియాపూర్ భూముల్లో దళితులకు డబుల్ బెడ్ రూమ్ లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.