: తమ నాయకుడిని 'పప్పూ' అని సంబోధించి.. ఇరకాటంలో పడ్డ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు!
సోషల్ మీడియాలో ప్రతి అంశం కూడా క్షణాల్లో ఎంతో మందికి చేరిపోతుంది. సామాజిక మాధ్యమంలో పలు అంశాలు వివాదానికి కేంద్ర బిందువుగా మారుతున్నాయి. యూపీలోని మీరట్ లో ఇలాంటి ఘటనే జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుని పేరుతో వాట్సాప్ లో వెలువడిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది.
రాహుల్ గాంధీని జనాదరణ కలిగిన నేతగా, రైతు నేతగా, యువనేతగా అభివర్ణిస్తూ జిల్లా అధ్యక్షుడు వినయ్ ప్రధాన్ పేరుతో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాట్సాప్ గ్రూపులో ఓ పోస్టు వెలువడింది. అయితే, రాహుల్ పేరుతో పాటు పప్పూ అని కూడా జతకావడం వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో వినయ్ ప్రధాన్ పై వాట్సాప్ గ్రూపులోనే ఇతర నేతలు తిట్ల దండకం ప్రారంభించారు. దీంతో కంగుతిన్న వినయ్... ఆ పోస్టు తాను పెట్టలేదని, బిజ్ నౌర్ కు చెందిన అనురాగ్ చేసిందని చెప్పారు. అందరిలాగానే తనకు కూడా రాహుల్ పై అంతులేని అభిమానం ఉందని అన్నారు. అయినప్పటికీ, ఆయనపై విమర్శల జడివాన ఇంకా ఆగలేదు.