: చంద్రబాబు రాక్షసానందం పొందుతున్నారు.. తిప్పికొడదాం: ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్


రాష్ట్రం విడిపోయిన తర్వాత, ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు కలసికట్టుగా బతకాలని తాము కోరుకుంటుంటే.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెట్టేలా ప్రవర్తిస్తున్నారంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. తెలంగాణకు ఇబ్బందులను కలగజేస్తూ రాక్షసానందం పొందుతున్నారంటూ విమర్శించారు. విద్యుత్ సంస్థ ఉద్యోగాలు, పదోన్నతులు, ఆస్తులను కబ్జా చేయడానికి చంద్రబాబు కుట్రలకు పాల్పడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'జాగో తెలంగాణ.. బాగో ఆంధ్ర ఉద్యోగులు' అంటూ నిన్న తెలంగాణ ఇంజినీర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో మహా ధర్నా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ రిలీవ్ చేసిన 1,254 మంది విద్యుత్ ఉద్యోగులను ఏపీ ప్రభుత్వం విధుల్లోకి తీసుకోవాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లు లభించకుండా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా ఇక్కడే తిష్ట వేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ మండిపడ్డారు. 2013 సీనియార్టీ ప్రకారం ప్రమోషన్లు ఇవ్వాలంటూ ఆంధ్ర అధికారులు వితండవాదం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్లను జారీ చేస్తే... కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారని విమర్శించారు. విభజన తర్వాత కూడా 75 శాతం మంది ఏపీ ఉద్యోగులు తెలంగాణలోనే ఉన్నారని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News