: మహాసముద్రాలపై ఆధిపత్యం కోసం రూ. 60 వేల కోట్లతో భారత్ భారీ ప్రణాళిక
రక్షణ రంగంలో, ముఖ్యంగా భారతావనికి మూడు వైపులా ఉన్న సముద్రాలపై ఆధిపత్యం సాధించే దిశగా, ఇప్పటికే 'స్కార్పీన్' పేరిట జలాంతర్గాముల ప్రాజెక్టును చేపట్టిన ఇండియా, ఇప్పుడు మరో భారీ ప్రణాళిక రూపొందించనుంది. దేశంలో డిఫెన్స్ మాన్యుఫాక్చరింగ్ కు మరింత ఊతమిచ్చేలా రూ. 60 వేల కోట్లతో అత్యాధునిక సబ్ మెరైన్ల తయారుకు నిర్ణయించినట్టు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇందుకు సంబంధించి ప్రైవేటు సంస్థలకూ ఆహ్వానం పలుకుతూ ఈఓఐ (ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్)లను జారీ చేయనున్నామని, ఈ మెగా డీల్ ప్రాసెస్ త్వరలోనే ప్రారంభమవుతుందని అధికారులు పేర్కొన్నారు.
భారత్ చేపట్టిన రక్షణ రంగ ప్రాజెక్టు పీ-75 ఐ ప్రాజెక్టులో ఇంజనీరింగ్ దిగ్గజం లార్సెన్ అండ్ టూబ్రో, రిలయన్స్ డిఫెన్స్ మాత్రమే అర్హత సాధించాయి. ఇక ఈ భారీ ప్రాజెక్టుకు విదేశాలకు చెందిన ఓఈఎం (ఒరిజినల్ ఎక్విప్ మెంట్ మాన్యుఫాక్చరర్స్) లను కూడా ఆహ్వానించే ఆలోచనలో ఉన్నట్టు అధికారులు తెలిపారు. కాగా, స్కార్పీన్ క్లాస్ సబ్ మెరైన్ల తయారీ నిమిత్తం చేపట్టిన పీ-75 ఏలో ఆరు జలాంతర్గాములను తయారు చేస్తున్న సంగతి తెలిసిందే.