: బీజేపీలో చేరి రాజకీయాల్లోకి రానున్న బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్?
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, భారతీయ జనతా పార్టీలో చేరడం ద్వారా రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇటీవలి కాలంలో అక్షయ్, సామాజిక అంశాల నేపథ్యంలో తయారవుతున్న సినిమాల్లో ఎక్కువగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన తాజా చిత్రం కూడా ఈ తరహాలోనిదే. ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ‘స్వచ్ఛభారత్’ ప్రచారం నేపథ్యంలో తయారైన కథతో ‘టాయ్‌లెట్ - ఏక్ ప్రేమ్ కథా’ చిత్రంలో ఆక్షయ్ నటిస్తున్నారు.
గత నెలలో చిత్రం గురించిన సమాచారాన్ని మోదీకి వెల్లడించేందుకు స్వయంగా వెళ్లిన ఆయన, జవాన్ల కోసం ‘భారత్ కే వీర్’ పేరిట ఓ వెబ్ సైట్ ను కూడా ప్రారంభించారు. బీజేపీతో పాటు ఆర్ఎస్ఎస్ కీ అక్షయ్ దగ్గరవుతున్నారు. ఆర్ఎస్ఎస్ ‘శివ్ శక్తి సంఘ్’ పేరిట ఓ కార్యక్రమం చేపట్టగా, దానికి నిధులందించాలని అక్షయ్ నిర్ణయించుకున్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే, ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉందని సినీ పరిశ్రమ వర్గాలంటున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.