: మాల్యాకు లండన్‌లో ఘోర పరాభవం.. దొంగ, దొంగ అంటూ నినాదాలు చేసిన ప్రేక్షకులు!
భారత్ నుంచి పలాయనం చిత్తగించిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా (61)కు లండన్‌లో ఘోర పరాభవం ఎదురైంది. ఓవల్‌లో ఆదివారం జరిగిన భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్‌ను తిలకించేందుకు వచ్చిన ఆయన తీవ్ర అవమానాన్ని మూటగట్టుకున్నారు. స్టేడియంలో ఆయనను చూసిన ప్రేక్షకులు ‘చోర్, చోర్’ (దొంగ, దొంగ) అని పెద్దపెట్టున నినాదాలు చేశారు. వారికి మరికొందరు జతకలవడంతో స్టేడియం హోరెత్తింది. భారత బ్యాంకులకు రూ.9వేల కోట్ల రూపాయలు ఎగవేసిన మాల్యా గతేడాది మార్చిలో లండన్ పారిపోయి తలదాచుకుంటున్నారు. ప్రస్తుతం ఆయనను వెనక్కి రప్పించేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తోంది. బ్రిటన్ కోర్టులో ఆయనపై విచారణ జరుగుతోంది.
మ్యాచ్ చూసేందుకు వచ్చిన మాల్యా మైదానంలోకి వేగంగా నడుచుకుని వెళ్తుండగా గమనించిన భారతీయ ప్రేక్షకులు ‘చోర్ గయా చోర్‘ (దొంగ వెళ్తున్నాడు), ‘చోర్, చోర్’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. అయితే అవేమీ పట్టించుకోని మాల్యా వడివడిగా అడుగులేసుకుంటూ స్టేడియంలోకి చేరారు. కాగా, గతవారం బర్మింగ్‌హామ్‌లో జరిగిన భారత్-పాక్ మ్యాచ్‌కు కూడా మాల్యా హాజరై దర్జాగా తిలకించారు. అనంతరం ఆయన ట్వీట్ చేస్తూ భారత్ ఆడే అన్ని మ్యాచ్‌లకు హాజరవుతానని పేర్కొన్నారు. అంతేకాదు ‘యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ చారిటీ జస్టిస్ అండ్ కేర్’ కోసం విరాట్ కోహ్లీ ఇచ్చిన ఫండ్ రైజింగ్ డిన్నర్‌లోనూ విజయ్ మాల్యా కనిపించడం సంచలనం సృష్టించింది.