: ఆసీస్ ను ఇంటికి పంపిన ఇంగ్లండ్... పండగ చేసుకున్న బంగ్లాదేశ్!


ఇంగ్లండ్ లో జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా కథ ముగిసింది. గ్రూప్-ఏ నుంచి సెమీస్ కు కచ్చితంగా చేరుతుందని భావించిన ఆస్ట్రేలియాను అడుగడుగునా వరుణుడు అడ్డుకోవడంతో ఒక్క విజయం కూడా లేకుండానే ఇంటిదారి పట్టింది. సెమీస్ కు వెళ్లాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్ లో ఇంగ్లండ్ తో పోటీ పడ్డ మ్యాచ్ ని సైతం వరుణుడు అడ్డుకోవడం ఆస్ట్రేలియాకు అశనిపాతమైంది. డక్వర్త్ లూయిస్ పద్ధతిన 40 పరుగుల తేడాతో ఇంగ్లండ్ గెలిచినట్టు అంపైర్లు ప్రకటించడంతో ఆస్ట్రేలియా కథ ముగిసింది. ఈ మ్యాచ్ ని ఆస్ట్రేలియా వాసులు ఎంత ఆసక్తిగా చూశారో, కోట్లాది మంది బంగ్లాదేశ్ క్రికెట్ అభిమానులు అంతకు మించిన ఆసక్తితో చూశారు. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఓడిపోతే బంగ్లాదేశ్ సెమీస్ కు వెళ్లనుండటమే ఇందుకు కారణం. వారి కోరిక నెరవేరడంతో బంగ్లా అభిమానులు పండగ చేసుకున్నారు.

ఇక ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టు 9 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. పలువురు ఆటగాళ్లు రాణించినప్పటికీ, ఎవరూ భారీ స్కోరు చేయలేకపోవడం ఆ జట్టుకు శాపమైంది. ఫించ్‌ 68, స్మిత్‌ 56, ట్రావిస్‌ హెడ్‌ 71 పరుగులు చేశారు. ఆపై 278 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు ఆదిలోనే తడబడింది. 35 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో తొలిసారి ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. ఆపై ఆట తిరిగి ప్రారంభమయిన తరువాత మోర్గాన్‌, స్టోక్స్‌ విరుచుకుపడటంతో, 20 ఓవర్లకే 126 పరుగులు సాధించి, వర్షం పడ్డా గెలిచేందుకు కావాల్సిన పరుగులను సాధించింది. ఆపై మోర్గాన్ అవుట్ అయినా, స్టోక్స్, తన జోరును కొనసాగించి సెంచరీ సాధించాడు. ఆట చివర్లో మరోసారి వర్షం పడ్డప్పటికీ, ఇంగ్లండ్ స్కోరు మెరుగ్గా ఉండటంతో గెలిచినట్టు ప్రకటించారు. దీంతో చాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ - ఏ నుంచి ఇంగ్లండ్ తో పాటు, న్యూజిలాండ్ పై చిరస్మరణీయమైన విజయం సాధించిన బంగ్లాదేశ్ సెమీస్ కు వెళ్లింది.

  • Loading...

More Telugu News