: ఇది నిజంగా నా జీవితంలో మర్చిపోలేని సంఘటన: దాసరి సంతాప సభలో చిరంజీవి
ఇటీవల మృతి చెందిన దర్శకుడు దాసరి నారాయణరావుకు హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌లో ఈ రోజు సంస్మరణ సభ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీనటులు, దర్శకులు, నిర్మాతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ... దాసరి ఆసుపత్రిలో చేరిన మొదటి రోజుల్లో ఆయనను చూడడానికి తాను వెళ్లానని అన్నారు. ఆ సమయంలో దాసరి నారాయణ రావు మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, తాను నటించిన ‘ఖైదీ 150’ సినిమా స్కోరెంత అని అడిగారని చిరంజీవి అన్నారు.
అద్భుతమైన కలెక్షన్లు సాధిస్తోందని చెప్పగానే, 'వి' సింబల్ చూపించి, దాసరి చప్పట్లు కొట్టి మరీ సంతోషాన్ని వ్యక్తం చేశారని చెప్పారు. ఇది నిజంగా తన జీవితంలో మర్చిపోలేనని చిరంజీవి వ్యాఖ్యానించారు. ఆమధ్య ఓ సమావేశం సందర్భంగా దాసరి నారాయణరావు ఇంటికి తాను వెళ్లినప్పుడు ఆయన తనకు స్వయంగా అన్నం తినిపించారని చెప్పారు. ఆయనతో తనకు ఎన్నో తీపి గుర్తులు ఉన్నాయని చెప్పారు. ఆయన లేకపోవడం సినీ పరిశ్రమకు పెద్ద లోటని అన్నారు.