: భర్త స్థానంలో పోలీస్ కమిషనర్ గా బాధ్యతలను స్వీకరించిన భార్య!
భర్త స్థానంలో భార్య పోలీస్ కమిషనర్ గా బాధ్యతలను స్వీకరించిన అరుదైన ఘటన కేరళలోని కొల్లాంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే, కొల్లాం పోలీస్ కమిషనర్ గా సతీష్ బినో పని చేస్తున్నారు. ఇటీవలే ఆయనకు ప్రమోషన్ వచ్చింది. దీంతో, ఆయన స్థానంలో ఆయన సతీమణి అజీతా బేగంను నియమించారు. ఈ రోజు ఆమె బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తామిద్దరం ఒకే బ్యాచ్ కు చెందినవారమని తెలిపారు. ఇప్పటికే నాలుగు జిల్లాల్లో తాను పని చేశానని... కానీ, ఇప్పుడు తాను బాధ్యతలను చేపడుతున్న చోట మీడియా అధిక ప్రాధాన్యతను ఇస్తోందని అన్నారు. తామిద్దరం ట్రైనింగ్ సమయంలో ఎలా తర్ఫీదు పొందామో... ఇప్పుడు కూడా అదే సామర్థ్యంతో పని చేస్తున్నామని చెప్పారు.