: జగన్ కు ఓవరాక్షన్ చేయడం తప్పా మరేమీ తెలియదు.. వారు ముగ్గురు మూడు కోతులు: సీపీఐ నారాయణ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌కు ఓవరాక్షన్ చేయడం తప్పా మరేమీ తెలియదని సీపీఐ నారాయణ అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఓవర్ యాక్షన్ చేస్తే అధోగతి పాలవుతారు తప్పా మరేమీ మిగలబోదని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు, కేసీఆర్, జగన్ మూడు కోతుల్లా వ్యవహరిస్తున్నారని అన్నారు. మోదీని వారు ముగ్గురూ ఒక దేవుడిలా చూస్తున్నారని, ఢిల్లీకి వెళ్లి మోదీ ముందు భక్తి, గౌరవాలతో మాట్లాడుతున్నారని అన్నారు. సమస్యలపై మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. మహాత్మ గాంధీ మూడు కోతుల గురించి చెప్పారని, అందులో ఒక కోతి వినదు, మరొకటి మాట్లాడదు, ఇంకోటి చూడదు అని అన్నారు.
మోదీ ముందు ఈ ముగ్గురూ ఇలాగే వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్ ఛాంబర్ లోకి నీళ్లు వచ్చాయంటూ టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారని, రాష్ట్ర సమస్యలపై మాట్లాడకుండా, భవనంలోకి నీళ్లొచ్చాయి, ఛాంబర్‌లోకి నీళ్లొచ్చాయి అంటూ వాదించుకోవడమేంటని ప్రశ్నించారు. జగన్ ఓవరాక్షన్ ఆపేయాలని ఆయన సూచించారు. లక్ష్మీపార్వతి, శశికళ ఓవర్ యాక్షన్ తోనే నష్టపోయారని, జగన్ కూడా అలాగే నష్టపోతారని అన్నారు.