: రాజకీయ విచిత్రం.... నిరాహార దీక్షకు దిగిన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్!
ప్రస్తుత రాజకీయాల్లో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఉత్తరప్రదేశ్ లో రైతులకు రుణమాఫీ చేసిన కేంద్ర ప్రభుత్వం తమకు ఎందుకు ఆ పథకానని వర్తింపజేయడం లేదని ప్రశ్నిస్తూ మధ్యప్రదేశ్ లోని మాందసౌర్ లో రైతులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో పలువురు రైతులు ప్రాణాలు కోల్పోగా ఈ ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి. దీంతో రాహుల్ గాంధీ ఆ ప్రాంతంలో పర్యటించాలని ప్రయత్నించి భంగపడ్డారు కూడా. ఈ నేపథ్యంలో రైతులు అనవసరంగా అల్లర్లు చేస్తున్నారని ఆరోపిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శాంతి దీక్ష పేరుతో నిరాహారదీక్షకు దిగారు.
సమస్యలు పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి...రైతులు తనతో చర్చించవచ్చని చెబుతూ నిరాహారదీక్షకు దిగడం ఆసక్తి రేపుతోంది. ఆందోళనకారులతో చర్చించి, సమస్యను పరిష్కరించకుండా, తాను దీక్షాస్థలిలో ఉన్నానని, తనతో ఎవరైనా చర్చించవచ్చని పేర్కొనడం ఆసక్తి రేపుతోంది. ఆయన దీక్షకు మంత్రులంతా మద్దతు పలకడం విశేషం. రాష్ట్రంలో శాంతి నెలకొనేందుకు ఇదే సరైన మార్గమని ఆయన చెప్పారు. కాల్పులు జరిపిన పోలీసు సిబ్బందిపై తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చిన ఆయన, రైతు ఆందోళనల్లో హింసకు పాల్పడే అసాంఘిక శక్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.