: టెర్రర్ హిట్ లిస్టులో హైదరాబాద్.... హైటెక్ సిటీ, ఇనార్బిట్ మాల్, కీలక ప్రాంతాల్లో భద్రత పెంపు


గోకుల్ ఛాట్, లుంబినీ పార్కు, దిల్ షుక్ నగర్ పేలుళ్లతో ఉగ్రవాదుల కడుపు నిండినట్టు కనిపించడం లేదు. దేశంలో ఏ మూల పట్టుబడిన ఉగ్రవాదిని విచారించినా, హైదరాబాదు హిట్ లిస్టులో ఉన్నట్టు తెలుస్తోంది. ఉగ్రవాదుల రక్తదాహానికి అన్నెంపున్నెం ఎరుగని అమాయకులు బలైపోతుండగా, మరోసారి ఉగ్రపంజా హైదరాబాదుపై ఉందని నిఘా సంస్థలు గుర్తించాయి. గత నెల 7న జమ్మూకశ్మీర్‌ టాంట ప్రాంతంలోని పోలీసు పికెట్‌ పై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో కశ్మీర్ పోలీసులు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) గత నెల 13న కశ్మీర్‌ లో ఐదుగురు ఉగ్రవాదుల్ని అరెస్టు చేసింది.

పాక్‌ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఆదేశాల మేరకు పని చేసే అబ్దుల్‌ రషీద్‌ హర్గా దీనికి నేతృత్వం వహించాడని తేలింది. దీంతో అతనిని పట్టుకుని విచారించగా.... లష్కరే తోయిబా బెంగళూరు, హైదరాబాద్‌ లను టార్గెట్‌ చేసినట్టు తేలింది. ఈ రెండు నగరాల్లోని ఐటీ సంస్థలతో పాటు షాపింగ్ మాల్స్‌ లక్ష్యంగా విధ్వంసం సృష్టించేందుకు ప్రణాళికలు రచించాయని నిఘా సంస్థలు గుర్తించాయి. దీంతో కేంద్ర నిఘా సంస్థ ఇంటలిజెన్స్‌ బ్యూరో (ఐబీ) హెచ్చరికల మేరకు తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. హైదరాబాదులోని హైటెక్ సిటీ, షాపింగ్ మాల్స్, ఇతర కీలక ప్రాంతాల్లో భద్రతను పెంచారు. ఇనార్బిట్ మాల్ లో డాగ్, బాంబు స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు.

  • Loading...

More Telugu News