: లిఖిత కిడ్నాప్ ను ఛేదించడం చాలా కష్టమైంది!: ఏపీ డీజీపీ
గుంటూరు జిల్లా భట్టిప్రోలు మైనర్ బాలిక లిఖిత (13) కేసును చాలా కష్టపడి ఛేదించినట్టు ఏపీ డీజీపీ సాంబశివరావు తెలిపారు. ఈ కేసు ఛేదనకు 13 లక్షల రూపాయలు ఖర్చైనట్టు తెలిపారు. డబ్బు సమస్య కాకపోయినప్పటికీ ఈ కేసు ఛేదనకు పోలీసులు చాలా కష్టపడ్డారని అన్నారు. భట్టిప్రోలులో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన అనంతరం బాలిక భయపడి ఎక్కడికైనా వెళ్లి ఉంటుందని పోలీసులు నిర్లక్ష్యం చేశారని చెప్పారు. అయితే ఆటోడ్రైవర్ పై అనుమానం వ్యక్తం చేస్తూ, కిడ్నాప్ కేసు పెట్టిన అనంతరం కేసును సీరియస్ గా తీసుకున్నామని, మొత్తం ఏడు పోలీసు బృందాలను రంగంలోకి దింపామని తెలిపారు.
గతంలో బీఎస్ఎఫ్ జవానుగా పనిచేసి, సస్పెండ్ అయిన నాగేశ్వరరావు (46) అనే వ్యక్తి సొంత ఊరు భట్టిప్రోలులో ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. చాక్లెట్ల నుంచి మొదలు పెట్టి, ఆమెకు ఏవి కావాలంటే అవి ఇస్తూ లిఖితతో చనువు ఏర్పరచుకున్నాడు. గత ఏప్రిల్ 21న లిఖతతో ప్రకాశం జిల్లా వెళ్లాడు. అక్కడి నుంచి వరంగల్ మీదుగా బయల్దేరాడు. కానీ ఎక్కడికి వెళ్లాడో తెలియలేదు. దీంతో పోలీసులపై సీఎం, మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి ఒత్తిడి పెంచడంతో స్పెషల్ టీమ్ లను ఏర్పాటు చేసి, గతంలో అతను పని చేసిన ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. అలాగే భట్టిప్రోలులోని ల్యాండ్ లైన్లు, కాయిన్ బాక్సులపై నిఘా వేశారు. అయితే మాజీ బీఎస్ఎఫ్ జవాను కావడంతో సెల్ ఫోన్ వాడలేదు, బ్యాంక్ అకౌంట్ నూ వాడలేదు.
ఈ నేపథ్యంలో గత వారం అతని అకౌంట్ నుంచి కొంత మొత్తం విత్ డ్రా అయినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో వెంటనే అప్రమత్తమై, జమ్మూకశ్మీర్ లోని సాంబ సెక్టార్ పరిధిలో ఆరా తీశారు. ఈ సందర్భంగా అక్కడి స్థానికులు 'కొత్తగా ఇద్దరు వ్యక్తులు వచ్చారని, ఒక వ్యక్తి పెద్దవాడు అని, అతనితో ఓ బాలిక వుందని, వారిద్దరూ దగ్గర్లోని ఒక కంపెనీలో పనిలో చేరారని స్థానికులు చెప్పారు. దీంతో జాగ్రత్తగా వెళ్లి, అతనిని అదుపులోకి తీసుకున్నారు. లిఖితను అదుపులోకి తీసుకునే సమయంలో గుంటూరు రానంటూ సతాయించింది. దీంతో ఆమెకు ధైర్యం చెప్పి విమానంలో గన్నవరం తరలించి, విజయవాడ తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా ఏపీ డీజీపీ మాట్లాడుతూ, మీ పిల్లలు ఏం చేస్తున్నారు? ఎలా వ్యవహరిస్తున్నారు? అన్న విషయాలను తల్లిదండ్రులు పరిశీలిస్తూ వుండాలని చెప్పారు. సోషల్ మీడియా ఖాతాలు, సెల్ ఫోన్లు పిల్లలకు ఇచ్చేసి చేతులు దులుపుకుంటున్నారని, వాటి వల్ల ఎంత నష్టమో ఏ తల్లిదండ్రులైనా పిల్లలకు వివరించే ప్రయత్నం చేశారా? అని ఆయన అడిగారు. మీ పిల్లల నడవడిని గమనించండి, లేకపోతే తీవ్ర పరిణామాలు చవిచూసే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.