: మూడేళ్లలో అమరావతి బాగా అభివృద్ధి చెందింది: తెలంగాణ మంత్రి ఈటల
తమ కుమారుడు నితిన్ వివాహానికి ఆంధ్రప్రదేశ్ నేతలను ఆహ్వానించడానికి విజయవాడకు వెళ్లిన తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పెళ్లి పత్రిక అందించిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన... ఏపీ మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్రలను కూడా కలిసి తన కుమారుడి పెళ్లికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ... మూడేళ్లలో అమరావతి ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. తాను మూడేళ్ల క్రితం అమరావతి భూమి పూజ జరుగుతున్న సమయంలో ఇక్కడకు వచ్చానని అన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఇరు రాష్ట్రాల్లోనూ అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. ఏపీలో ఏరువాక దిగ్విజయంగా కొనసాగుతుందని చెప్పారు. ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు పెద్దవేమీ కాదని, త్వరలోనే పరిష్కారం అవుతాయని వ్యాఖ్యానించారు.