: సిమ్లాలో గుండెపోటుతో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మృతి
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్ రెడ్డి కన్నుమూశారు. కులుమనాలిలో గుండెపోటుకు గురైన ఆయన తుదిశ్వాస విడిచారు. వాహనంలో ప్రయాణిస్తున్న సమయంలో ఆయనకు గుండెపోటు వచ్చింది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, కులులో జరుగుతున్న కమిటీ సమావేశానికి వెళుతుండగా ఆయన గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయనను సిమ్లాలోని ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించారు. అయినా ఉపయోగం లేకపోయింది.
ఆయనతో పాటు మరో 10 మంది ఎంపీలు కూడా కులుమనాలి మీటింగ్ కు వెళ్లారు. 1967లో పాల్వాయి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మొత్తం ఐదు సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2007-09 మధ్య కాలంలో ఎమ్మెల్సీగా ఉన్నారు. 2012లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1936 నవంబర్ 19న మహబూబ్ నగర్ జిల్లా నడింపల్లిలో ఆయన జన్మించారు. ఆయనకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. పాల్వాయి మరణవార్తతో వివిధ పార్టీలకు చెందిన నేతలు షాక్ కు గురయ్యారు.