: నవాజ్ షరీఫ్ ను పలకరించి చెయ్యి కలిపిన నరేంద్ర మోదీ!
భారతావనిని అస్థిర పరచాలని దాయాది పాకిస్థాన్ ఎంతగా ప్రయత్నిస్తున్నా, శాంతిమంత్రాన్ని పఠిస్తూ స్నేహహస్తం చాచేందుకే ప్రయత్నించే ఇండియా, మరోసారి అదే పని చేసింది. ఖజకిస్థాన్ రాజధాని అస్థానాలో జరగనున్న ఎస్సీఓ (షాంగై కోఆపరేషన్ ఆర్గనైజేషన్) సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను పలకరించి కరచాలనం చేశారు. పలు దేశాధినేతల గౌరవార్థం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో వీరిద్దరూ కలిశారు.
గడచిన ఏడాది వ్యవధిలో వీరిద్దరూ కలవడం ఇదే తొలిసారి. చర్చలు, ఉగ్రవాదం కలసి సాగబోవని స్పష్టం చేసిన ఇండియా, అంతర్జాతీయ వేదికలపై పాక్ ను ఒంటరిని చేసే ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక మోదీ, షరీఫ్ ల మధ్య కరచాలనం, పలకరింపులకు మించి పెద్దగా మాటలు సాగలేదని తెలుస్తోంది. కాగా, నేడు చైనా అధ్యక్షుడు క్సీ జిన్ పింగ్ తో మోదీ సమావేశమై ఎన్ఎస్జీ, ఓబీఓఆర్, అరుణాచల్ ప్రదేశ్ లో 6 ప్రాంతాలకు చైనా సొంత పేర్లు పెట్టుకోవడం తదితర అంశాలపై నెలకొన్న సమస్యలను పరిష్కరించేలా చర్చలు సాగించవచ్చని తెలుస్తోంది.