: నేతల పని ముగిసింది.. ఇక ఓటర్ల మెదళ్లకు పని మిగిలింది
కర్ణాటకలో నెల రోజులుగా సాగిన సుదీర్ఘ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడింది. కాంగ్రెస్ తరఫున ప్రధాని మన్మోహన్, సోనియా, రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు, మన రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి చిరంజీవి, ముఖ్యమంత్రి కిరణ్ తదితర అగ్రనేతలు కన్నడ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి తమవంతు ఉపన్యాసాలను ఊదరగొట్టారు. ఇక బీజేపీ తరఫున అద్వానీ, మోడీ, వెంకయ్యనాయుడు, సుష్మాస్వరాజ్, జైట్లీ తదితరులు మరోసారి తమకే అధికారం కట్టబెట్టాలని ఓటర్లను వేడుకున్నారు. జేడీఎస్, యడ్యూరప్ప కర్ణాటక జనతా పార్టీ కూడా తమవంతుగా ఓటర్లను 'ఓట్లేయండీ బాబూ' అంటూ ప్రాధేయపడ్డాయి.
ఎవరేం చెప్పినా ఇప్పుడు వారి భవితవ్యం ఓటర్ల చేతిలోనే ఉంది. 223 స్థానాలకు ఈ నెల 5న(ఆదివారం) పోలింగ్ జరుగుతుంది. 8న ఫలితాలు వెల్లడవుతాయి. 4.50కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సర్వేల ఆధారంగా చూస్తే కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యంతో అధికారం కైవసం చేసుకుంటుందని తెలుస్తోంది. బీజేపీ ప్రతిపక్ష పాత్రకు పరిమితం కాక తప్పదు. పాపం కర్ణాటకను మరోసారి ముఖ్యమంత్రిగా ఏలుదామనుకున్న యడ్యూరప్ప కలలు కల్లలేనని సర్వేల కథనం. అయినా, బీజేపీ ఓడిపోతుందిలే.. అనుకుంటూ అప్ప సంబరపడుతున్నాడు.