: మయన్మార్ విమానం ట్రాజడీ: సముద్రంపై తేలియాడుతున్న చిన్నారుల, మహిళల మృతదేహాలు
అండమాన్ సముద్రంలో కుప్పకూలిన మయన్మార్ సైనిక విమానం శకలాలు, విమానంలో ప్రయాణించి ప్రాణాలు పోగొట్టుకున్న వారి మృతదేహాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. విమానం కూలిన ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న నౌకలకు ఓ వ్యక్తి, మహిళ, చిన్నారి మృతదేహంతో పాటు లగేజీ బ్యాగ్ లు, సేఫ్టీ జాకెట్లు, విమానం టైరు నీటిపై తేలియాడుతూ కనిపించాయి. ఈ ఉదయం 8:25 గంటల ప్రాంతంలో పలువురి మృతదేహాలను గుర్తించినట్టు మయన్మార్ సైనిక ప్రతినిధి 'ఏఎఫ్పీ' వార్తా సంస్థకు తెలిపారు.
లుంగ్లాన్ తీరానికి సమీపంలోనే విమానం కూలిందని, 9 నేవీ షిప్ లు, మూడు విమానాలు ఈ విమానం కోసం వెతికాయని వెల్లడించారు. కాగా, విమానంలోని ప్రయాణికులు ఎంతమందన్న విషయమై అధికారికంగా స్పష్టమైన సమాచారం లభించడం లేదు. తాజా అప్ డేట్ ప్రకారం, విమానంలో 122 మంది ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. వీరిలో 35 మంది సైనికులు, 14 మంది విమానం సిబ్బంది కాగా, మిగిలిన వారు సైనికుల కుటుంబీకులని, వీరిలో 15 మంది చిన్నారులున్నారని ఆర్మీ చీఫ్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. చిన్నారుల్లో అత్యధికులు యాంగాన్ లో వైద్య పరీక్షలకు వెళుతున్నారని తెలిపారు.