: ప్రాణభయంతో వణికిపోతున్న అంతర్జాతీయ నేరగాడు ఛార్లెస్ శోభరాజ్!
వివిధ దేశాలకు చెందిన పోలీసులకు సవాలు విసిరి తప్పించుకుతిరిగిన కరుడుగట్టిన అంతర్జాతీయ స్మగ్లర్ ఛార్లెస్ శోభరాజ్ ప్రాణభయంతో వణికిపోతున్నాడు. ఆగ్నేయ ఆసియా కేంద్రంగా దాదాపు డజనుకు పైగా దేశాలకు చెందిన మహిళలను సులభంగా వల్లో వేసుకుని, అత్యంత పాశవికంగా హత్య చేయడంతో పాటు మాదక ద్రవ్యాలు, అక్రమ ఆయుధాల సరఫరా వంటి నేరాల్లో ఆరితేరిన శోభరాజ్...1986లో ఢిల్లీ పోలీసులకు పట్టుబడి, తీహార్ జైల్లో సెక్యూరిటీ సిబ్బందికి మత్తు మందు ఇచ్చి పరారయ్యాడు. అనంతరం గోవాలోని ఓ కేసినోలో మధుకర్ జెండే అనే పోలీసాఫీసర్ చార్లెస్ ను అరెస్ట్ చేశాడు. అప్పుడు మళ్లీ పదేళ్ళ శిక్ష అనుభవించాడు. అనంతరం 1997లో ఆయనను జైలు నుంచి విడుదల చేసింది.
2003లో నేపాల్ వీధుల్లో సంచరిస్తున్న శోభరాజ్ ను ఓ జర్నలిస్ట్ గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వగా అరెస్ట్ చేశారు. హత్యా నేరాలపై అక్కడి కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించింది. ఈ క్రమంలో శిక్ష అనుభవిస్తున్న శోభరాజ్ కు గుండెపోటు వచ్చింది. అప్పటి నుంచి డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. దీనికి తోడు ఈ మధ్యే నేపాల్ సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా...శోభరాజ్ పై కేసు వేసిన వ్యక్తి నేపాల్ లోనే నువ్వు చావడం ఖాయమని తేల్చిచెప్పాడు. దీంతో మరింత ఆందోళనకు గురయ్యాడని, ఆయన గుండెలో ఓ వాల్వ్ పూర్తిగా దెబ్బతిందని త్వరగా వైద్యం చేయాలని వైద్యులు సూచించారు.
దీంతో అతనికి ఈ శనివారం (జూన్ 10న) ఖాట్మాండులోని గంగాలాల్ హార్ట్ సెంటర్ లో ఓపెన్ హార్ట్ సర్జరీ నిర్వహించనున్నారు. ఇది అతనిని మరింత భయాందోళనలకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో తన సొంత దేశమైన ఫ్రాన్స్ లోని పారిస్ లో ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకోవడానికి అనుమతినివ్వాలని కోరాడు. దానికి జైలు అధికారులు అంగీకరించకపోవడంతో....ఫ్రాన్స్ లో అయితే ఆపరేషన్ రిస్క్ 1 శాతం ఉంటుందని, అదే ఖాట్మాండులో ఈ రిస్క్ 3-5 శాతం ఉంటుందని ఆందోళన చెందుతున్నాడు.
దీంతో ఆపరేషన్ అనంతరం తాను బతికే అవకాశం ఉంటుందని భావించడం లేదని, ఈ లోపు తను కొంత మందికి ఫోన్ చేసుకోవాల్సి ఉంటుందని, అందుకు అనుమతి ఇవ్వాలని జైలు అధికారులను కోరాడు. మరోపక్క, తన వైద్యానికి సహకరించాలని ఫ్రాన్స్ ఎంబసీని కోరానని, మరోసారి కోర్టును ఆశ్రయిస్తానని, అనుమతి తీసుకోవడం ద్వారా విన్నవిస్తానని, పారిస్ లో తాను చేయాల్సిన పనులు పూర్తి చేయాలని భావిస్తున్నానని శోభరాజ్ తెలిపాడు. కాగా, ఉగ్రవాదులకు అక్రమంగా ఆయుధాలు సరఫరా చేశానని శోభరాజ్ అంగీకరించిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం శోభరాజ్ వయసు 73 సంవత్సరాలు.