: కాళ్లావేళ్లా పడ్డా కనికరించలేదు...కూతుర్ని చంపి నాలుగు గంటలు నరకం చూపారు!: గ్యాంగ్ రేప్ బాధితురాలు
పదకొండు రోజుల క్రితం గుర్గావ్ లో సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలు మీడియాతో మాట్లాడింది. ఆమె తెలిపిన ఘటన వివరాల్లోకి వెళ్తే... మే 29 అర్ధరాత్రి ఆలస్యంగా వచ్చిన భర్తతో గొడవపడ్డ బాధితురాలు, అలిగి పుట్టింటికి వెళ్లేందుకు తన 9 నెలల కుమార్తెను తీసుకుని బయల్దేరింది. అర్ధరాత్రి కావడంతో ఇతర రవాణా సౌకర్యం అందుబాటులో ఉండకపోవడంతో ఆమె ఒక ట్రక్కును ఆశ్రయించింది. ఆ ట్రక్కు డ్రైవర్ ఆమెను లైంగికంగా వేధించడంతో ఆమె ప్రతిఘటించింది. దీంతో అతను ఆమెను ఎన్ హెచ్8పై వదిలేశాడు. అనంతరం రోడ్డు మీద ఇంకో వాహనం కోసం ఎదురు చూస్తున్న ఆమె దగ్గరకు ఒక టెంపో వచ్చి ఆగింది. అందులో డ్రైవర్ తో పాటు మరో ఇద్దరు పూటుగా తాగేసి ఉన్నారు. వారు తనను బలవంతంగా టెంపోలోకి ఎక్కించే ప్రయత్నం చేయడంతో ఆందోళన చెందిన ఆమె వారితో పెనుగులాడింది.
దీంతో వారు ఆమెపై దాడికి దిగారు. ఇంతలో ఆ పెనుగులాటకు పాప నిద్రలేచి బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టింది. పూటుగా తాగేసి ఉన్న కామాంధులు పాపనోటిని గట్టిగా అదిమిపెట్టారు. ఇంకా ఏడుపు ఆపకపోవడంతో ఆమెను రోడ్డు మీదకు విసిరేశారు. బాధితురాలు కాళ్లావేళ్లాపడ్డా కనికరించలేదు. అనంతరం అదే రోడ్డుపై సుమారు నాలుగు గంటలపాటు ఆమె శరీరంతో ఆడుకుని, నరకం చూపించి వదిలి వెళ్లిపోయారు. దీంతో బాధితురాలు ఎలాగోలా ఓపిక తెచ్చుకుని, కుమార్తెను భుజానవేసుకుని, గుర్గావ్ లోని ఓ ఆసుపత్రికి వెళ్లింది. పాపను పరీక్షించిన వైద్యులు ఆమె మరణించిందని తెలిపారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసులో తొలుత నిర్లక్ష్యంగా వ్యవహరించిన మహిళా ఎస్సైని ఉన్నతాధికారులు సస్పెండ్ చేయడంతో... వేగంగా స్పందించిన పోలీసులు ఈ ఘటనలో నిందితులను గుర్తించారు. అనంతరం ఘటనకు పాల్పడిన ముగ్గురు నిందితుల్లో యోగేంద్ర, అమిత్ ను అరెస్టు చేయగా, టెంపో డ్రైవర్ జేకేష్ పరారీలో ఉన్నాడు.