: అన్నా డీఎంకేలో విజయశాంతి... చిన్నమ్మతో భేటీ అనంతరం తమిళనాట ఇదే హాట్ టాపిక్!
తమిళనాట ఆసక్తికర వార్త ఒకటి హాట్ టాపిక్ గా మారింది. ఒక దశలో తమిళ, తెలుగు సినీ పరిశ్రమలో అగ్రతారగా వెలుగొంది, రాజకీయ అరంగేట్రం చేసి, పార్టీని స్థాపించి, పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేసి, తరువాత ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన సినీ నటి విజయశాంతి...అన్నాడీఎంకేలో చేరబోతున్నారనే టాపిక్ తమిళనాట ఆసక్తి రేపుతోంది. ఈ క్రమంలోనే ఆమె జైలుకు వెళ్లి శశికళను అకస్మాత్తుగా కలిశారు. అనంతరం అన్నాడీఎంకే డిప్యూటీ అధినేతగా వ్యవహరిస్తున్న టీటీవీ దినకరన్ తో ఆమె సమావేశమయ్యారు. ఈ సమయంలో తనకు మద్దతిచ్చేందుకు వచ్చిన ఎమ్మెల్యేలను కూడా ఆయన పక్కనబెట్టడం పలు అనుమానాలు రేపుతోంది. ఈ నేపథ్యంలో విజయశాంతి అన్నాడీఎంకేలో చేరనున్నారా? అన్న అనుమానం అందర్లోనూ కలిగింది.
మరోవైపు ఈ భేటీ అనంతరం పార్టీ వ్యవహారాలను దినకరన్ చక్కదిద్దగలరన్న నమ్మకం తనకుందని విజయశాంతి ఎమ్మెల్యేలతో పేర్కొన్నట్టు తెలుస్తోంది. దీంతో విజయశాంతి అన్నాడీఎంకేలో చేరనున్నారన్న గుసగుసలు ప్రారంభమయ్యాయి. తమిళనాట రజనీ రాజకీయ ప్రవేశం చేస్తారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో సినీ పరిశ్రమలోని పలువురు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయశాంతి తమవైపు ఉంటే ఎంతో కొంత లాభమని దినకరన్ వర్గం భావిస్తోందని తెలుస్తోంది. మరోవైపు దినకరన్ బలం పెరుగుతోంది. 14 మందితో మొదలైన ఆయన బలం మంగళవారం నాటికి 22కి, బుధవారం సాయంత్రానికి 32కి పెరిగింది. ఈ సంఖ్య మరింత పెరగనుందని, ఒకట్రెండు రోజుల్లో తమ బలం ఏంటో తెలిసి వస్తుందని ఆ వర్గం నేతలు చెబుతున్నారు.