: రణరంగాన్ని తలపించిన మాండసౌర్.. కలెక్టర్, పోలీసులను చితకబాదిన రైతులు, వాహనాలు, గోడౌన్లకు నిప్పు


మధ్యప్రదేశ్‌లోని మాండసౌర్ బుధవారం రణరంగాన్ని తలపించింది. మంగళవారం పోలీసుల కాల్పుల్లో ఐదుగురు రైతులు మృతి చెందడాన్ని జీర్ణించుకోలేపోతున్న రైతులు బుధవారం మాండసౌర్‌లో బీభత్సం సృష్టించారు. పిపిలియామండీలో కర్ఫ్యూ అమల్లో ఉన్నప్పటికీ వేలాదిమంది రైతులు అక్కడికి చేరుకుని కలెక్టర్, పోలీసులను చితక్కొట్టారు. గోడౌన్లు, వాహనాలకు నిప్పు పెట్టారు. మద్యం షాపులను లూటీ చేశారు. ఈ ఘటనలో 12 మందికి పైగా పోలీసులు గాయపడగా ఆర్‌బీ శర్మ అనే అధికారి పరిస్థితి విషమంగా ఉంది. ఆందోళనకారుల రాళ్లదాడిలో పలువురు జర్నలిస్టులు కూడా గాయపడ్డారు. పట్టణంలోకి రాజకీయ నాయకులను రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు.

చనిపోయిన రైతుల అంతిమయాత్ర కోసం ఏర్పాట్లు జరుగుతుండగా బర్ఖేదా పంత్ గ్రామానికి వెళ్లిన కలెక్టర్ స్వతంత్ర కుమార్ సింగ్‌ను చూసిన రైతులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఆయన చుట్టూ భద్రత ఉన్నప్పటికీ కలెక్టర్ వద్దకు చేరుకుని దాడిచేశారు. ఆయన చెంపపై కొట్టారు. తర్వాత పోలీసులపై రాళ్ల దాడికి దిగారు. చుట్టుపక్కల ఉన్న గోడౌన్లను తగలబెట్టారు. మాండసౌర్ బౌపాస్‌ రోడ్డులో ఐదు కిలోమీటర్ల వరకు దిగ్బంధించిన రైతులు వాహనాలను తగలబెట్టి, వాటిలోని వస్తువులను లూటీ చేశారు. 22 వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. కాయంపూర్‌లో ఆందోళనకారులు ఏటీఎంను పగలకొట్టేందుకు ప్రయత్నించి విఫలం కావడంతో దానిని తగలబెట్టారు.

  • Loading...

More Telugu News