: మీ సామాన్లన్నీ వదిలి, విండోలోంచి కిందికి దూకేయండి...పైలట్ ఆదేశం...బెంబేలెత్తిన ప్రయాణికులు


వర్జిన్ ఎయిర్‌ లైన్స్‌ విమానంలో ఎయిర్ హోస్టెస్ చేసిన ప్రకటనతో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. విమాన ప్రయాణికురాలు తెలిపిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... వర్జిన్ ఎయిర్ లైన్స్ కి చెందిన విమానం ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి అల్బురీ ఎయిర్ పోర్ట్ కి బయల్దేరింది. కాసేపట్లో విమానంలోని ప్రయాణికులంతా దిగిపోయేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇంతలో బాత్రూంలోకి వెళ్లిన ఎయిర్ హోస్టెస్ పరుగున వచ్చి పెద్దగా కేకలు వేస్తూ....‘‘ఖాళీ చేయండి... ఖాళీ చేయండి.. మీ సామాన్లన్నీ వదిలిపెట్టి విండోలో నుంచి దూకేయండి’’ అంటూ ఆదేశించింది.

దీంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా బెంబేలెత్తిపోయారు. అంతలో పైలట్ 'ఎమర్జెన్సీ విండోస్ ద్వారా కిందకి దూకేయండి' అని అనౌన్స్ చేశాడు. దీంతో ప్రయాణికులంతా బ్రతుకు జీవుడా అంటూ ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ద్వారా బయటకు దూకేశారు. అనంతరం భద్రతా సిబ్బంది తనిఖీలు నిర్వహించి, 30 ఏళ్ల ఓ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రయాణం మధ్యలో బాత్రూంలోకి వెళ్లిన ఆ వ్యక్తి అక్కడ ఒక లేఖ పెట్టాడని, అందులో ‘‘చంపేస్తా... శరీరం ముక్కలయ్యేలా హింసిస్తా’’ అంటూ అందులో రాశాడని, దానిని చూసే ఎయిర్ హోస్టెస్ కంగారుపడి, పైలెట్ కు చెప్పి అందర్నీ హడలెత్తించిందని ఆస్ట్రేలియా పోలీసులు తెలిపారు. విచారణలో 'ఇదంతా సరదా కోసం చేశా'నని సదరు ప్రయాణికుడు చెప్పడం కొసమెరుపు.

  • Loading...

More Telugu News