: కుప్పకూలిన అనిల్ అంబానీ రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఈక్విటీ
అనిల్ దీరూభాయ్ అంబానీ గ్రూప్ సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఈక్విటీ నేటి ట్రేడింగ్ సెషన్ లో భారీగా పడిపోయింది. రేటింగ్ ఏజన్సీలు ఫిచ్, మూడీస్ లు సంస్థ క్రెడిట్ రేటింగ్ ను తగ్గించడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పడిపోగా, సంస్థ ఈక్విటీ ఏకంగా 4 శాతానికి పైగా దిగజారి రూ. 19 వద్దకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ. 948 కోట్ల నష్టాలు వచ్చాయని సంస్థ వెల్లడించిన తరువాత, ఇప్పటివరకూ ఆర్ కామ్ ఈక్విటీ 24 శాతం పడిపోయింది.
ఓ వైపు నుంచి అన్న ముఖేష్ అంబానీ రిలయన్స్ జియో, మరో వైపు నుంచి మిగతా టెలికం సంస్థల దూకుడుతో రిలయన్స్ కమ్యూనికేషన్స్ కుదేలవుతూ వచ్చింది. మార్కెట్ వాటా పడిపోవడం, పాత రుణాలను తీర్చాలని బ్యాంకుల నుంచి వస్తున్న ఒత్తిడి ఈక్విటీ పతనానికి కారణమైంది. ఈ మధ్యాహ్నం 1:20 గంటల సమయంలో రిలయన్స్ ఈక్విటీ విలువ క్రితం ముగింపుతో పోలిస్తే, 3.47 శాతం పతనంతో రూ. 19.45 వద్ద కొనసాగుతుండగా, 3.03 కోట్ల వాటాలు చేతులు మారాయి. గత సంవత్సరం ఆగస్టులో రూ.55 వద్ద ఉన్న ఈక్విటీ విలువ, పది నెలల వ్యవధిలో 60 శాతానికి పైగా పతనమైనట్లయింది.