: అమ్మ చెంత నిద్రిస్తే.. చిన్నారికి నిద్రాభంగమేనట!
తల్లి పక్కనే పడుకునే చంటి బిడ్డలకు నిద్ర తక్కువ అవుతోందని అమెరికాలోని పెన్సిల్వేనియా కాలేజ్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. తల్లి పక్కనే పడుకునే నాలుగు నెలలు, ఆపై వయసు శిశువులకు నిద్ర తక్కువ అవుతున్న విషయాన్ని తమ పరిశోధనలో గుర్తించినట్టు చెప్పారు. నాలుగు నెలల వయసు వచ్చే సరికి శిశువులు తమంతట తాముగా స్వేచ్ఛగా నిద్రపోవడం అలవాటవుతుందని చెప్పారు. ఆ వయసు దాటిన తర్వాత కూడా తల్లులు తమ బిడ్డలను తమ గదిలోనే పడుకోబెట్టుకోవడం వల్ల శిశువుల నిద్రకు భంగం వాటిల్లుతోందని పరిశోధకుడు డాక్టర్ ఇయాన్ పాల్తెలిపారు.
ఇందుకు సంబంధించి.. నాలుగు నుంచి ముప్పై నెలల పాటు సుమారు 279 మంది చిన్నారుల నిద్ర తీరును తమ బృందం పరిశీలించిందని చెప్పారు. తమ తల్లులతో కలిసి ఒకే గదిలో పడుకున్న శిశువులు, మిగతావారితో పోల్చితే రోజుకు సగటున నలభై ఐదు నిమిషాలు తక్కువగా నిద్రపోతున్నారని తెలిపారు. దీనిపై మార్గదర్శకాల కోసం అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఏఏపీ) నిశితంగా చర్చించాల్సి ఉంది. కాగా, పిల్లలకు ఏడాది వయసు వచ్చే వరకూ తల్లులు తమతో పాటే పిల్లల్ని పడుకోబెట్టుకోవాలనీ, తద్వారా ఆకస్మిక మరణ ముప్పు నుంచి తప్పించుకోవచ్చని ఏఏపీ గతంలో సూచించింది.