: తహసీల్దారు శంకరరావుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు
విశాఖపట్టణంలో భూ రికార్డుల మాయంలో ప్రధాన సూత్రధారి, సస్పెండ్ అయిన తహసీల్దార్ శంకరరావుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. విశాఖలోని శంకరరావు నివాసంలోను, మరో నాలుగు చోట్ల అవినీతి నిరోధక శాఖ సోదాలు నిర్వహిస్తోంది. శంకరరావు కుమారుడి అత్తగారు, కోటవురట్ల ఎంపీపీ నివాసంలోను, విజయనగరం, బొబ్బిలిలోని శంకరరావు బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. అవినీతి నిరోధక శాఖ డీజీ ఆర్పీ ఠాకూర్ నేతృత్వంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. కాగా, గతంలో విశాఖ గ్రామీణ మండలానికి తహసీల్దార్ గా శంకరరావు పని చేశారు. శ్రీకాకుళం జిల్లాలో తహసీల్దార్ గా పని చేస్తున్న సమయంలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయన్ని ఇటీవల సస్పెండ్ చేయడం జరిగింది.