: హైదరాబాదులో భూ ఆక్రమణల కేసులో ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ, జేసీ మేనల్లుడు దీపక్ రెడ్డి అరెస్టు!
భూ ఆక్రమణల కేసులో ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఈయనతో పాటు న్యాయవాది శైలేంద్ర సక్సేనా, రియల్టర్ శ్రీనివాస్ లను కూడా అరెస్టు చేశారు. సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి మాట్లాడుతూ, ఆసిఫ్ నగర్ లో రూ.163 కోట్ల విలువ చేసే భూములను కబ్జా చేసినట్లు దీపక్ రెడ్డిపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే వారిని నిన్న రాత్రి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను న్యాయస్థానం ఎదుట హాజరుపరిచి రిమాండ్ కు తరలించినట్లు చెప్పారు.
ఆసిఫ్ నగర్ లో రూ. 163 కోట్ల విలువైన భూములను దీపక్ రెడ్డి కబ్జా చేసినట్లు షేక్ పేట తహసీల్దార్ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద ఆయన్ని అరెస్టు చేశారు. గుడిమల్కాపూర్ పరిధిలోని బోజగుట్ట ప్రాంతంలో 78 ఎకరాల ఈనాం భూములను, బంజారాహిల్స్ రోడ్ నెంబరు 2లో సుమారు 2.40 ఎకరాల భూమిని కాజేసేందుకు ప్రయత్నించినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. కాగా, ఇందుకు సంబంధించి నాలుగు నెలల క్రితమే దీపక్ రెడ్డి, శైలేంద్ర సక్సేనాపై కేసు నమోదైంది. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి దీపక్ రెడ్డి మేనల్లుడు. ఎమ్మెల్సీగా ఇటీవలే ఆయన ప్రమాణ స్వీకారం చేశారు.