: పళనిస్వామి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న దినకరన్!
అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తడంతో... అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ తనకు నమ్మకస్తుడైన పళనిస్వామిని ముఖ్యమంత్రిని చేశారు. తన కనుసన్నల్లో నడుస్తూ, పార్టీలో తన పట్టు సన్నగిల్లకుండా పళనిస్వామి వ్యవహరిస్తాడనే నమ్మకంతో ఆమె ఈ పని చేశారు. అయితే, సీఎం కాగానే పళనిస్వామి రూటు మార్చారు. పార్టీలో శశికళ ఆనవాళ్లు కూడా లేకుండా చేయడం మొదలెట్టారు. అంతేకాదు, జైల్లో ఉన్న చిన్నమ్మను ఇంతవరకు ఒక్కసారి కూడా కలవలేదు. మరోవైపు, రెండాకుల గుర్తు కోసం ఎన్నికల సంఘం అధికారికి లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి, శశికళ బంధువు దినకరన్ జైలుకు వెళ్లాడు. ఈ నేపథ్యంలో, ఆయనను పార్టీ నుంచి బహిష్కరించే ప్రయత్నం కూడా చేశారు.
ఈ క్రమంలో దినకరన్ బెయిల్ పై బయటకు వచ్చారు. వస్తూనే ఘాటుగా స్పందిస్తూ, తనను పార్టీ నుంచి ఎవరూ బహిష్కరించలేరని స్పష్టం చేశారు. అంతేకాదు, నిన్న పరప్పణ అగ్రహార జైలుకు వెళ్లి శశికళతో మంతనాలు జరిపారు. పార్టీలో అంతర్గతంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై వీరు చర్చించారు.
ప్రస్తుతం దినకరన్ తన స్వరాన్ని పెంచారు. పార్టీలో తన పట్టు పెంచుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటికే 20 మంది ఎమ్మెల్యేలు దినకరన్ కు మద్దతుగా నిలిచారు. వీరిలో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ దినకరన్ ను ముఖ్యమంత్రిని చేయాలని బహిరంగంగా డిమాండ్ చేశారు. దినకరన్ జోరు పెంచుతుండటంతో, పళనిస్వామి శిబిరంలో అలజడి ప్రారంభమైందని సమాచారం. అంతవరకు వస్తే... ప్రభుత్వాన్ని కూల్చేందుకు కూడా దినకరన్ వెనుకాడరని కొందరు చెబుతున్నారు.