: అక్కడంతే!... అధికారితో మాట్లాడడానికి చెట్టు ఎక్కిన కేంద్ర మంత్రి!
సొంత రాష్ట్రం రాజస్థాన్లో పర్యటనకు వెళ్లిన కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్కు చెట్టు ఎక్కాల్సిన అవసరం వచ్చింది. తన రాష్ట్రంలోని తన సొంత నియోజకవర్గం బికనీర్లో ఆయన ప్రజల సమస్యలను పరిష్కరించడానికి వెళ్లారు. ఢోలియా అనే గ్రామంలోని ప్రజలతో చర్చించారు. తమ గ్రామంలోని ఆస్పత్రిలో నర్సులు తగినంతగా లేరని అక్కడి వారు చెప్పారు. దీంతో ఆ సమస్య పరిష్కారం కోసం సంబంధిత ఉన్నతాధికారికి ఆయన వెంటనే ఫోన్ చేశారు. అయితే, ఫోన్ సిగ్నల్స్ అందలేదు. సిగ్నల్ రావాలంటే చెట్టు ఎక్కాల్సిందేనని, చెట్టు ఎక్కితేనే ఎంతో దూరంగా ఉన్న టవర్ నుంచి సిగ్నల్ అందుతుందని అన్నారు. దీంతో ఆయన చెట్టు ఎక్కుతానని చెప్పారు. ఆయన కోసం వెంటనే ఒక నిచ్చెన తెప్పించడంతో దాని సాయంతో ఆయన చెట్టు ఎక్కారు. అధికారితో ఫోన్ మాట్లాడి సమస్య గురించి వివరించిన అనంతరం మళ్లీ కిందకు వచ్చారు.