: వర్షాలు వస్తున్నాయంటేనే భయం కలుగుతోంది: కేటీఆర్
వర్షాకాలం వస్తోందంటేనే చాలా భయంగా ఉందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాదులో వర్షం పడితే ఎక్కడి నీరు అక్కడే నిలిచే ప్రమాదం ఉందని... అందువల్ల నగరంలో వర్షాలు పడకపోయినా పర్వాలేదని సరదాగా అన్నారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, నగర మేయర్ బొంతు రామ్మోహన్ లతో కలసి ఈరోజు ఆయన 70 మినీ జెట్టింగ్ మిషన్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మ్యాన్ హోల్స్ ను మాన్యువల్ గా శుభ్రం చేయడాన్ని ఇకపై పూర్తిగా ఆపేస్తున్నామని... ఈ మిషన్ల ద్వారానే ఇకపై శుభ్రపరుస్తామని చెప్పారు. వర్షాకాలం రానున్న తరుణంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.