: పార్టీలో నెంబర్ టూ నేనే.. నన్ను ఎవరూ తొలగించలేరు: దినకరన్
అన్నాడీఎంకే పార్టీలో శశికళ తర్వాత రెండో ప్రధాన వ్యక్తిని తానేనని ఆ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ స్పష్టం చేశారు. పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిని తానేనని చెప్పారు. జైలు నుంచి బయటకు వచ్చానంటే, తాను మళ్లీ తిరిగి వచ్చినట్టేనని అన్నారు. పార్టీని ఏక తాటిపై నడిపించే బాధ్యత తన మీదే ఉందని చెప్పారు. ఉప ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తనను తొలగించే అధికారం ఎవరికీ లేదని... ప్రధాన కార్యదర్శి శశికళకు మాత్రమే ఉందని అన్నారు.
పార్టీ నుంచి తనను ఎవరూ బహిష్కరించలేదని... శశికళ సూచన మేరకే పార్టీ కార్యకలాపాలకు తాను దూరంగా ఉన్నానని చెప్పారు. జైల్లో ఉన్న శశికళను తాను ఈ రోజు కలుస్తున్నానని... అయితే మేనల్లుడిగా ఆమెను కలవడం లేదని, పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి హోదాలోనే ఆమెతో భేటీ అవుతున్నానని తెలిపారు. శశికళతో భేటీ సందర్భంగా పార్టీకి సంబంధించి పలు నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.