: ఐసిస్ ను పోషిస్తున్నారంటూ... ఖతార్ తో సంబంధాలను తెంచుకున్న పలు ముస్లిం దేశాలు!
గల్ఫ్ దేశాల మధ్య విభేదాలు ముదురుతున్నాయి. తాజాగా ఖతార్ తో అన్ని రకాల సంబంధాలను తెంచుకుంటున్నామంటూ సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఈజిప్ట్, యూఏఈలు ఈ రోజు ప్రకటించాయి. ఆల్ ఖైదా, ఐసిస్ లకు ఖతార్ సహాయ సహకారాలు అందిస్తోందని... అందుకే ఆ దేశంతో సంబంధాలకు ఫుల్ స్టాప్ పెడుతున్నామని ప్రకటించాయి.
ఖతార్ తో దౌత్యపరమైన సంబంధాలను సౌదీ తెంచుకుందని... ఆ దేశంతో ఉన్న సరిహద్దులను కూడా మూసివేసిందని సౌదీ న్యూస్ ఏజెన్సీ 'ఎస్పీఏ' తెలిపింది. టెర్రరిజం నుంచి తమ దేశాన్ని కాపాడుకునే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొంది. ఖతార్ కు సంబంధించి తమ పోర్టులు, విమానాశ్రయాలను కూడా వాడుకోనివ్వబోమని సౌదీతో పాటు ఈజిప్ట్, యూఏఈలు తెలిపాయి. టెర్రరిజంకు ఆర్థికసాయం చేస్తోందంటూ ఖతార్ పై చాలాకాలంగా ఆరోపణలు ఉన్నాయి. 2013లో ఆఫ్ఘాన్ తాలిబాన్ సంస్థ ఖతార్ రాజధాని దోహాలో తన కార్యాలయాన్ని కూడా ప్రారంభించింది.
2022లో ఖతార్ లో ఫుట్ బాల్ ప్రపంచకప్ జరగనుంది. మరోవైపు, ఐసిస్ పై పోరాడుతున్న అమెరికా సంకీర్ణ సేనలలో ఖతార్ కూడా భాగస్వామిగా ఉండటం గమనార్హం.