: అమానుషం: మార్చురీ వ్యాన్ ఇచ్చేందుకు నిరాకరణ.. భార్య మృతదేహాన్ని బైక్‌పై తరలించిన భర్త
ప్రభుత్వ వాహనాన్ని ఇచ్చేందుకు ఆస్పత్రి సిబ్బంది నిరాకరించగా, ప్రైవేటు వాహనానికి డబ్బులు కట్టే స్తోమత లేకపోవడంతో ఓ భర్త తన భార్య మృతదేహాన్ని బైక్‌పై ఇంటికి తరలించాడు. బీహార్‌లోని పూర్ణియా జిల్లాలో ఈ అమానుషం చోటుచేసుకుంది.
జిల్లాలోని రణిబరి గ్రామానికి చెందిన శంకర్ షా (60), సుశీల దేవి (50) భార్యాభర్తలు. ఇటీవల అనారోగ్యం కారణంగా పుర్ణియా సదర్ ఆసుపత్రిలో చేరిన సుశీల.. పరిస్థితి విషమించడంతో శుక్రవారం మరణించింది. అంత్యక్రియల కోసం ఆమె మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు శంకర్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఆస్పత్రి సిబ్బంది మార్చురీ వ్యాన్ ఇచ్చేందుకు నిరాకరించారు. ప్రైవేటు వాహనాన్ని ఏర్పాటు చేసుకునే స్తోమత లేకపోవడంతో కుమారుడు బైక్ తీసుకురాగా మధ్యలో తల్లి మృతదేహాన్ని పెట్టి వెనక తండ్రి కూర్చోగా ఇంటికి తరలించారు. ఆస్పత్రి సిబ్బందిని వేడుకున్నా అంబులెన్స్ ఇవ్వలేదని, ప్రైవేటు వాహనం డ్రైవర్ రూ.1500 అడిగాడని శంకర్ వివరించాడు. ఇది చాలా బాధాకరమైన విషయమని, ఆసుపత్రిలో ఒకే ఒక్క మార్చురీ వ్యాన్ ఉందని, ప్రస్తుతం అది కూడా పనిచేయడం లేదని సర్దార్ ఆసుపత్రి సివిల్ సర్జన్ వాసిమ్ తెలిపారు. ఈ ఘటనపై జిల్లా మేజిస్ట్రేట్ పంకజ్ కుమార్ పాల్ విచారణకు ఆదేశించారు.