: ఉగ్రదాడిలో ఇద్దరు భారత జవాన్ల మృతి.. మరో నలుగురికి గాయాలు
జమ్ముకశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలోని కాజీగండ్ ప్రాంతంలో ఈ రోజు సైనిక వాహనశ్రేణిపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డ విషయం తెలిసిందే. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. మరో నలుగురు జవాన్లకు గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ఉగ్రవాదుల కోసం సైన్యం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపడుతోంది. జమ్ముకశ్మీర్ సరిహద్దు వద్ద నుంచి ఉగ్రచొరబాట్లకు మద్దతు ఇస్తున్న పాకిస్థాన్ ఆర్మీ స్థావరాలపై ఇటీవలే భారత సైన్యం దాడి చేసిన విషయం తెలిసిందే. ఓవైపు పాక్ రేంజర్ల కాల్పులు, మరోవైపు ఉగ్రవాదుల చొరబాట్లు ఎక్కువవుతుండడంతో జమ్ముకశ్మీర్‌లో ఆర్మీ పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది.