: యువకుడి కిడ్నాప్, దాడికి దారితీసిన హిందూ, ముస్లిం ప్రేమ
హైదరాబాదులోని హిందూ యువకుడు, ముస్లిం యువతి మధ్య ప్రేమ...యువకుడి స్నేహితుడి కిడ్నాప్, దాడికి దారితీసింది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే...సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహావీర్ ఆసుపత్రి సమీపంలో నాగరాజు అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన ముస్లిం యువతితో ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ పెద్దలకు చెప్పకుండా ఉడాయించారు. దీంతో ఏసీ గార్డ్స్ ప్రాంతానికి చెందిన 40 ముస్లిం యువకులు వారి కోసం గాలింపు చేపట్టారు.
అయితే ఎంత వెతికినా వారి ఆచూకీ తెలియకపోవడంతో నాగరాజు స్నేహితుడైన హబీబ్ నగర్ లోని కురమబస్తీలోని చంద్రకిరణ్ ఇంటిపై దాడి చేసి, అతనిని చితకబాదారు. అనంతరం అతనిని తమ వెంట కారులో తీసుకెళ్లారు. దీంతో అతని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రాత్రంతా గాలించి, చివరికి అతనిని ఎక్కడ దాచి ఉంచారో గుర్తించారు. దిల్ షుక్ నగర్ లోని ఓ ఇంట్లో బంధించిన చంద్రకిరణ్ ను విడిపించేందుకు వెళ్లగానే, పోలీసులను చూసిన ఇమ్రాన్, అఫ్జల్, చోటులు పరారయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.