: దేశంలోని అతి పొడవైన బ్రిడ్జికి పొంచి ఉన్న ముప్పు.. నిఘా వర్గాల హెచ్చరిక
ఇటీవల అసోంలో ప్రధాని ప్రారంభించిన దేశంలోనే అతి పొడవైన భూపెన్ హజారిక బ్రిడ్జ్‌కు బెదిరింపులు మొదలయ్యాయి. మే 26న మోదీ ఈ వంతెనను ప్రారంభించినప్పటి నుంచి చైనాకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో బ్రిడ్జికి ముప్పు ఉన్నట్టు ఇంటెలిజెన్స్ నుంచి హెచ్చరికలు అందినట్టు అసోం పోలీస్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ (స్పెషల్ బ్రాంచ్) పల్లబ్ భట్టాచార్య తెలిపారు. బ్రిడ్జి రక్షణ కోసం పోలీసుల మోహరింపును పెంచనున్నట్టు చెప్పారు. బ్రిడ్జికి భద్రత విషయంలో కేంద్రంతో చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు.
అసోం, అరుణాచల్‌ప్రదేశ్‌లను కలిపే ఈ బ్రిడ్జి ద్వారా భారత దక్షిణ సరిహద్దుకు దళాలను, ఆయుధాలను వేగంగా పంపే వీలుండడంతో చైనా తొలి నుంచి ఆందోళన వ్యక్తం చేస్తోంది. శక్తిమంతమైన భూకంపాలను సైతం తట్టుకునేలా నిర్మించిన ఈ బ్రిడ్జిపై నుంచి టన్నుల బరువున్న యుద్ధ ట్యాంకులను కూడా సులభంగా తరలించవచ్చు. ఇంత బలంగా నిర్మించిన ఈ నిర్మాణానికి వచ్చిన భయమేమీ లేదని నిపుణులు చెబుతున్నారు. ఈ బ్రిడ్జిని ఎవరూ ఏమీ చేయలేరని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
యుద్ధం కనుక వస్తే చైనా మొదట ఈ వంతెననే టార్గెట్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతోపాటు ఆ ప్రదేశంలోని ముఖ్యమైన నిర్మాణాలపైనే పొరుగుదేశం దృష్టి ఉంటుందన్నారు. అయితే బాంబులతో ఈ బ్రిడ్జిలోని చిన్న ముక్కను కూడా కదపలేరని, ఒకవేళ ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినా అతి తక్కువ సమయంలో తిరిగి పునరుద్ధరించగలమని స్పష్టం చేస్తున్నారు.