: మా దేవాన్ష్ కూడా హెరిటేజ్ పాలే తాగుతున్నాడు!: నారా బ్రాహ్మణి
హెరిటేజ్ పాలలో కల్తీ ఎంతమాత్రమూ లేదని, రెండు సంవత్సరాల తన కుమారుడు దేవాన్ష్ సైతం నిత్యమూ ఆ పాలే తాగుతాడని, సీఎం చంద్రబాబునాయుడు 2700 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసినప్పుడు కూడా తమ సంస్థ పాలే తాగారని హెరిటేజ్ ఫుడ్స్ ఈడీ నారా బ్రాహ్మణి స్పష్టం చేశారు. హెరిటేజ్ పాలను ఎక్కువ రోజులు నిల్వ ఉంచేందుకు కెమికల్స్ కలుపుతున్నారని తమిళనాడు మంత్రి రాజేంద్ర బాలాజీ చేసిన ఆరోపణలపై ఆమె స్పందించారు.
తమ పాలలో కల్తీ ఎంతమాత్రమూ లేదని, గడచిన 25 సంవత్సరాలుగా తాము నాణ్యతకే ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. పాలను సేకరించేందుకు నాణ్యమైన క్యాన్ లు మాత్రమే వాడుతున్నామని అన్నారు. హెరిటేజ్ సంస్థ నుంచి పెట్ బాటిల్ డ్రింక్స్ ను చెన్నైలో విడుదల చేసిన సందర్భంగా ఆమె మాట్లాడారు. మొత్తం 150కి పైగా ప్రాసెసింగ్ సెంటర్లను నిర్వహిస్తున్నామని, సమీప భవిష్యత్తులో టర్నోవర్ ను రూ. 6 వేల కోట్లకు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నామని అన్నారు. తమకు పాలందిస్తున్న వారి కోసం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు.