: అమెరికాలో ఉన్నత విద్య చదివేవారికి ఇచ్చే వీసాపై కొత్త నిబంధనలు... పలువురిలో ఆందోళన
అమెరికాలో మాస్టర్ డిగ్రీలు వంటి ఉన్నత విద్యను అభ్యసించిన విదేశీ విద్యార్థులకు జారీ చేసే హెచ్-1బీ స్టూడెంట్ వీసాపై కొత్త నిబంధనలను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. విద్యార్థులు చదువును ముగించుకుని డిగ్రీ తీసుకునే సమయానికి సదరు యూనివర్శిటీకి యునైటెడ్ స్టేట్స్ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ విభాగం నుంచి గుర్తింపు తప్పనిసరిని, అది ఉంటేనే స్టూడెంట్ హెచ్-1బీ వీసాకు అర్హులవుతారని అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం వెల్లడించింది.
కాగా, ప్రతి సంవత్సరమూ అమెరికా ప్రభుత్వం జారీ చేసే 65 వేల హెచ్-బీ వీసాలకు అదనంగా, అక్కడే ఉన్నత విద్యను పూర్తి చేసిన వారికి మరో 20 వేల వరకూ వీసాలను ఇస్తుంటారన్న సంగతి తెలిసిందే. కాగా, అమెరికాలో ఉన్నత విద్యను పూర్తి చేసి, ఉద్యోగం చేసుకునేందుకు అవకాశం కల్పించాలని పలు విదేశీ విద్యార్థులు చేసుకుంటున్న దరఖాస్తులను, యూనివర్శిటీకి గుర్తింపు లేదని చెబుతూ అమెరికా ప్రభుత్వం తిరస్కరిస్తుండటంతో ఆందోళన నెలకొంది.