: ఆంధ్ర ప్రాంతంలో పార్టీకి నష్టం వస్తుందని తెలిసినా సోనియా తెలంగాణ ఇచ్చారు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఆంధ్రలో తమ పార్టీకి నష్టం వస్తుందని తెలిసినప్పటికీ తమ ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ రోజు కాంగ్రెస్ సంగారెడ్డిలో నిర్వహిస్తున్న ప్రజాగర్జనలో ఆయన మాట్లాడుతూ... కేసీఆర్ మూడేళ్ల పరిపాలనలో ఒరిగింది ఏమీ లేదని అన్నారు. 6 దశాబ్దాల ఆకాంక్షను గుర్తించి సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే, ఇక్కడి ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదని అన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఆ సమయంలో తెలంగాణ బిల్లులో ఉంచిన అంశాలను అమలులోకి తీసుకురాలేక టీఆర్ఎస్ నేతలు దద్దమ్మల్లా మిగిలిపోయారని అన్నారు. ఖమ్మంలో స్టీల్ ఫ్యాక్టరీ రాలేదని, తెలంగాణలో ఒక్క జాతీయ ప్రాజెక్టు కూడా లేదని ఆయన అన్నారు.
మరోవైపు మోదీ అసమర్థత, నిర్లక్ష్యం వల్ల మొత్తం భారత్‌లో ఈ రోజు వ్యవసాయం సంక్షోభంలో పడిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. దేశ వ్యాప్తంగా యువతకి ఉద్యోగాలు కూడా రావడం లేదని అన్నారు. ఎన్నికల సమయంలో మోదీ రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారని, కనీసం 2 లక్షలయినా కల్పించలేదని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే విదేశాల నుంచి నల్లధనం తీసుకొస్తామని మోదీ చెప్పారని, ప్రతి ఒక్కరికి 15 లక్షల రూపాయలు ఇస్తామని ఎన్నో మాటలు చెప్పారని అన్నారు. ఏ ఒక్క హామీ నెరవేరలేదని విమర్శించారు.
ప్రత్యేక రాష్ట్రం వస్తే తమ జీవితాల్లో వెలుగులు నిండుతాయని ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రజలు అనుకున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి జ్ఞాపకం చేశారు. ఈ రోజు కేసీఆర్ పాలన వల్ల ప్రత్యేక తెలంగాణలో బంగారు తెలంగాణ కాదు కదా.. కనీసం ఒక్క కుటుంబం కూడా బంగారం కాలేదని, కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రం బాగుపడిందని అన్నారు. రైతుల ఆత్మహత్యల్లో మాత్రం తెలంగాణ నెంబర్ 1 గా ఉందని అన్నారు. రైతు రుణమాఫీ ఏకకాలంలో చేయకుండా, నాలుగు విడతలుగా చేసి రైతులను ఇబ్బందులకు గురిచేశారని అన్నారు. వ్యవసాయం సంక్షోభంలోకి నెట్టబడిందని చెప్పారు. మిర్చి పసుపు, కందులు, వరి పండించే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. అయినప్పటికీ కేసీఆర్‌లో చలనం లేదని అన్నారు.