: సెల్ఫీ ఎక్కడ తీసుకోవాలో కూడా తెలియదా?: ప్రియాంక చోప్రాపై నెటిజన్ల ఫైర్
బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కు వెళ్లిన తర్వాత ప్రియాంక చోప్రా తరచుగా ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉంది. బెర్లిన్ లో ప్రధాని మోదీని కలిసినప్పుడు దిగిన ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేసిన ప్రియాంక... ఆ తర్వాత విమర్శలపాలైంది. పొట్టి స్కర్ట్ వేసుకుని, ప్రధాని ముందు కాలు మీద కాలేసుకుని కూర్చోవడమేంటని చాలా మంది ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతలోనే మరోసారి నెటిజన్లతో తిట్లు తింటోంది పీసీ. బెర్లిన్ లో ఉన్న హోలోకాస్ట్ మెమోరియల్ వద్ద ఆమె సెల్ఫీ దిగింది. దీన్ని ట్విట్టర్ లో అప్ లోడ్ చేసింది. దీంతో, నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సెల్ఫీలు ఎక్కడ తీసుకోవాలో కూడా తెలవదా? అంటూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీకి చెందిన నాజీలు సుమారు 30 లక్షల మంది యూదులను ఊచకోత కోశారు. ఆ దారుణ ఘటనకు స్మృతిగానే హోలోకాస్ట్ మెమోరియల్ ను నిర్మించారు. అలాంటి సున్నితమైన ప్రదేశంలో ప్రియాంక సెల్ఫీ దిగి పోస్ట్ చేయడమే నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. ఆ తర్వాత తాను ఎలాంటి తప్పు చేసిందో ప్రియాంకకు అర్థమైంది. తన ట్విట్టర్ ఖాతా నుంచి ఆ సెల్ఫీని తీసేసింది.