: డ్రైవర్ లేకుండా పట్టాలపై 10 కిలోమీటర్లు పరుగులు తీసి, బెంబేలెత్తించిన ట్రైన్!
తమిళనాడులో ఒక ట్రైన్ డ్రైవర్ లేకుండానే పది కిలోమీటర్లు ప్రయాణించి రైల్వే సిబ్బందిని బెంబేలెత్తించింది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... తమిళనాడులోని తిరుచ్చి రైల్వేస్టేషన్ లోని 1ఏ ఫ్లాట్ ఫారంలో సాంకేతిక లోపంతో సిబ్బందిని ఇబ్బంది పెడుతున్న రైలింజన్ మరమ్మతులను ఈరోడ్ రైల్వే షెడ్ సిబ్బంది చేపట్టారు. సిబ్బంది దాని మరమ్మతుల్లో బిజీగా ఉన్నారు. ఆ రైలింజన్ డ్రైవర్ ప్లాట్ ఫాంపై నిలబడి ఉన్నాడు.
ఇంతలో ఉన్నట్టుండి ఆ రైలింజన్ హఠాత్తుగా దానంతట అదే స్టార్ట్ అయి బయల్దేరింది. దీంతో ఫ్లాట్ ఫాం మీద ఉన్న డ్రైవర్ షాక్ తిన్నాడు. దానిని ఆపే మార్గం కూడా కనబడలేదు. దీంతో వెంటనే ఉన్నతాధికారులకు సమాచారమందించాడు. దీంతో వారు అప్రమత్తం అయ్యారు. ఈలోగా, ఆ రైలు కరూర్ బైపాస్ వంతెన మార్గంలో వెళ్లి, పది కిలోమీటర్ల దూరం తరువాత దానికదే ఆగిపోయింది. ఆ సమయంలో ఆ దిశగా ఎటువంటి రైలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సాంకేతిక లోపం కారణంగానే అది అలా స్టార్ట్ అయి బయల్దేరిందని నిర్ధారించిన అధికారులు, ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు.